Topudurthi Prakash: టీడీపీ నేతల దుర్మార్గాలపై ఎంక్వైరీ వేయాలి 17 d ago

AP: శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లికి వస్తున్న జగన్‌ను చూసేందుకు వస్తున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎక్కడికక్కడ వాహనాలను నిలుపుదల చేయడం ఏంటని, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యం వలనే కురుబ లింగమయ్య హత్య జరిగిందని, ఆయన్ను హత్య చేసింది పరిటాల సునీత, బంధువులే అని ఆరోపించారు. ఇలాంటి హత్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఇదే చివరి రాజకీయ హత్య కావాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హత్య చేయడం నీచమైన చర్య అని, చట్టం సరిగ్గా పని చేస్తే ఈ హత్య జరిగేదా అని ప్రశ్నించారు.
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, గత పది నెలల్లో ఇక్కడ జరిగిన దుర్మార్గాలపై సీఐడీ, జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని పేర్కొన్నారు. కేవలం పది నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా పాలన చేస్తే ప్రజలు తిరగబడతారని తెలిపారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. కురుబ లింగమయ్య హత్యపై సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించి, శాంతిభద్రతలను కాపాడాలన్నారు. హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు.